State News- Sadar | యాదవులను రాజకీయంగా ప్రోత్సహిస్తాం
State News- Sadar | యాదవులను రాజకీయంగా ప్రోత్సహిస్తాం
మూసీని జీవనదిగా మారుస్తా
సదర్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
నగరాభివృద్ధిలో యాదవుల పాత్ర భేష్
తెలంగాణ సంస్కృతిలో భాగం
పశుపోషణే కాదు.. ధర్మరక్షణా మీ బాధ్యత
అంజన్న తడబడ్డా.. అనిల్‌కు అవకాశమిచ్చాం
సదర్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Hyderabad | రాష్ట్రంలో యాదవులు రాజకీయంగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ధర్మం వైపు నిలిచే యాదవులకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత తమ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత పెంచటం ద్వారా దీనిని విశ్వనగరాల సరసన నిలుపుతామని ప్రకటించారు. మూసీ నిర్వాసితులకు అండగా నిలవటంతో పాటు దానిని జీవనదిగా మారుస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పలువురు నేతలు పాల్గొన్నారు.
* ఏటా అధికారికంగా సదర్ ఉత్సవాలు..
హైదరాబాద్ నగరంలో అనాదిగా సదర్ ఉత్సవాలను అత్యంత వైభవంగా యాదవ సోదరులు నిర్వహించటం సంతోషకరమని, ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతిలో భాగమని సీఎం గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సదర్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఏటా ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సభా వేదిక నుంచే అధికారులకు ఆదేశాలిచ్చారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోనూ సదర్ సమ్మేళనం గొప్పతనాన్ని ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర కాదనలేనిదని సీఎం కొనియాడారు.
*అంజన్న మంత్రి అయ్యే వారు..
యాదవులు రాజకీయంగా వచ్చిన అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి బరిలో నిలిచిన అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించుకుని ఉంటే, నేడు ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండేవారని వ్యాఖ్యానించారు. ఆయన ఆ ఎన్నికలలో గెలవకున్నా.. కాంగ్రెస్ పార్టీ ఆయన కుమారుడైన అనిల్ కుమార్ యాదవ్ సేవలను గుర్తించి, యాదవ సామాజిక వర్గ ప్రతినిధిగా రాజ్యసభకు ఎంపిక చేసిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.
* * *
Leave A Comment